నూజివీడు (Nuzividu) ట్రిపుల్ ఐటీ (Triple IIIT) క్యాంపస్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షకు అనుమతించలేదని క్షణికావేశంతో రగిలిపోయిన ఓ విద్యార్థి (Student).. కిచెన్‌లో నుంచి రెండు కత్తులు తీసుకువచ్చి ప్రొఫెసర్ (Professor)ను కత్తులతో పొడిచి రక్త గాయాలు చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వినయ్(Vinay) అనే విద్యార్థి రెగ్యులర్ క్లాసులకు హాజరుకావడం మానేశాడు. హాజరు శాతం తక్కువగా ఉండటంతో ల్యాబ్ ఎగ్జామ్‌కు రావొద్దని ప్రొఫెసర్ ఎస్.ఎస్.వి. గోపాల్ రాజు (S.S.V. Gopal Raju) సూచించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి వినయ్ మొదట ప్రొఫెసర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడీ అనుమతి తీసుకురావాలని ప్రొఫెసర్ చెప్పడంతో వినయ్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం కిచెన్ రూమ్ నుంచి రెండు కత్తులు తెచ్చి ప్రొఫెసర్‌పై దాడి చేశాడు.
తోటి విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వినయ్ కత్తులతో భయపెడుతూ.. ప్రొఫెసర్ గోపాల్ రాజుపై దాడి చేశాడు. దీంతో ప్రొఫెసర్ తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ట్రిపుల్ ఐటీ సిబ్బంది ఆయనను నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ సంఘటనతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యాసంస్థల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








