ఇసుక దందాకు ఏడుగురు బలి..! ఏడు రోజులైనా తేలని కేసు

ఇసుక దందాకు ఏడుగురు బలి..! రోడ్డున పడిన మూడు కుటుంబాలు

నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పెరమణ జాతీయ రహదారిపై రాంగ్‌ రూట్‌లో వచ్చిన ఇసుక టిప్పర్ కారును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు, నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటుంది. కానీ నెల్లూరులో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ప్రమాదం జరిగి ఏడు రోజులు గడిచినా, ఈ కేసులో నిందితులు ఎవరనే దానిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఏ1, ఏ2, ఏ3 అని నమోదు చేసినప్పటికీ, ఏ1, ఏ2ల వివరాలను మాత్రం బయటపెట్టలేదు. వారి పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోవడం గమనార్హం. కేవలం డ్రైవర్‌, టిప్పర్‌ ఓనర్‌ పేర్లను విచారణ తర్వాత ఛార్జ్‌షీట్‌లో చేరుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇది అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రమాదానికి కారణమైన అసలు డ్రైవర్‌, టిప్పర్‌ ఓనర్‌ను తప్పించి, మరొకరి పేరును చేర్చేందుకు స్థానిక సీఐ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

ఆత్మకూరు సబ్‌ డివిజన్‌లోని పోలీసు అధికారులు ఇసుక, గ్రావెల్‌తో పాటు క్యాట్‌ ఫిష్‌, పిడిఎస్‌ రైస్‌ అక్రమ రవాణాదారులతో కుమ్మక్కై చేతులు తడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అసలు నిందితులను తప్పించేందుకు ఒక సీఐ విశ్వప్రయత్నాలు చేశారని, ఇది గమనించిన నెల్లూరు ఎస్పీ అజిత ఆయనకు హెచ్చరికలు కూడా జారీ చేశారని ప్రచారం జరుగుతోంది.

ఈ కేసు విచారణను ఆత్మకూరు డిఎస్పి వేణుగోపాల్‌కు అప్పగించినప్పటికీ, ఏడు రోజులుగా కేసులో ఎటువంటి పురోగతి లేదు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తూ, కేసును పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగానే పోలీసులు ఈ కేసును నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్‌ స్టేషన్‌కు వెళ్లిపోయినప్పటికీ, అతని వివరాలను పోలీసులు ఇంతవరకు బహిర్గతం చేయలేదు. టిప్పర్‌ ఏ కంపెనీకి చెందినది, దాని యజమాని ఎవరనేది పోలీసులకు తెలిసినప్పటికీ, వారిని తప్పించేందుకు నాటకాలు ఆడుతున్నారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ కేసును కొత్త ఎస్పీ అజిత ఎలా డీల్‌ చేస్తారు, నిందితులను అరెస్టు చేస్తారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment