జ‌న‌సేన ఎమ్మెల్యే ‘మనీ లాండరింగ్’.. రంగంలోకి ఈసీ

జ‌న‌సేన ఎమ్మెల్యే ‘మనీ లాండరింగ్’.. రంగంలోకి ఈసీ

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు లోకం నాగమాధవి చుట్టూ రాజకీయ ఉచ్చు బిగుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో తన సొంత సంస్థ ‘మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్’ ద్వారా భారీగా నిధుల మళ్లింపు (Money Laundering) జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ఎమ్మెల్యే సంస్థలో పనిచేసి మానేసిన ఆనంద్ అనే మాజీ ఉద్యోగి, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

శాలరీ రౌండ్ ట్రిప్పింగ్
2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి సాధారణ జీతం కంటే అదనంగా రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు జమ చేశారని ఆరోపణ. ఉద్యోగుల ఖాతాల్లో వేసిన ఆ అదనపు మొత్తాన్ని ఎన్నిక‌ల స‌మ‌యంలో లోకం మాధ‌వి అనుచరులు తిరిగి నగదు రూపంలో వెనక్కి తీసుకున్నారని, ఆ డబ్బును ఎన్నికల ఖర్చులకు అక్రమంగా మళ్లించారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. అధికారికంగా ఎన్నికల కమిషన్‌కు చూపిన ఖర్చులకు, వాస్తవంగా జరిగిన ఖర్చులకు పొంతన లేదని.. ఈ అక్రమ మార్గం ద్వారా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని ఫిర్యాదులో వెల్లడించారు.

రంగంలోకి ఎన్నికల కమిషన్
ఈ సంచ‌ల‌న‌మైన‌ ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC), తక్షణమే విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ విచారణలో నిధుల మళ్లింపు నిజమని తేలితే ఎమ్మెల్యే పదవికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈసీ విచారణ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

గ్రౌండ్‌లోనూ ఎమ్మెల్యేపై వ్య‌తిరేక‌త‌
ఎన్నికల ప్రచార సమయంలో “100 రోజుల్లో 100 ఐటీ కంపెనీలు” తీసుకువస్తానని, నెల్లిమర్ల యువతకు ఉపాధి కల్పిస్తానని భారీ వాగ్దానాలు చేసిన లోకం మాధవి, ఇప్పుడు కనీస సమస్యలను కూడా పరిష్కరించలేక పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో కనీసం డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయించలేకపోయారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గ‌తంలో నిర్వ‌హించిన భోగాపురం మండల సమావేశంలో ఎమ్మెల్యే సొంత ఇంటి పన్ను బకాయిల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే సుమారు రూ. 24 లక్షల ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని సర్పంచ్ నూకరాజు సభలో వెల్లడించారు. పంచాయతీ అభివృద్ధి కోసం ఆ పన్ను కట్టాలని రిక్వెస్ట్ చేసిన సర్పంచ్‌పై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం వివాదానికి దారితీసింది. సొంత ఇంటి పన్ను కట్టడానికి వెనకాడుతున్న ఎమ్మెల్యే, నియోజకవర్గ అభివృద్ధిని ఎలా గాడిలో పెడతారని ప్రతిపక్షాలు మరియు స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment