మనుషులకు కళాపోషణ అవసరం అన్నది ఒక నానుడి. అలాగే నటి అన్న తర్వాత గ్లామర్ తప్పనిసరి అని సినీ వర్గాల మాట. అందుకే అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న వారు సైతం ఇప్పుడు అందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఎలాంటి గ్లామర్ అవసరం లేకుండానే పాన్ ఇండియా స్టార్ (Pan India Star)గా ఎదిగిన కథానాయిక (Heroine) ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా సాయి పల్లవి (Sai Pallavi)నే. డాక్టర్ అయ్యి నటిగా మారిన అరుదైన తారల్లో ఆమె ఒకరు.
సాయి పల్లవి మంచి నృత్యకారిణి (Dancer). ఆ ఆసక్తే ఆమెను సినిమాల వైపు నడిపించింది. తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సాయి పల్లవి, మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ (‘Premam’) ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.
తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్న సాయి పల్లవికి ప్లాప్‌ల సంఖ్య చాలా తక్కువ. అంతేకాదు, ప్లాప్ అయిన చిత్రాల్లో కూడా తన నటనకు మంచి మార్కులు పడటం అరుదైన విషయం. దీనికి కారణం పాత్రల ఎంపికలో సాయి పల్లవి చూపించే ప్రత్యేక శ్రద్ధే అని చెప్పొచ్చు. తనకు నచ్చిన బాటలో పయనిస్తూ, అందంపై కాకుండా అభినయానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అలా ‘సహజ నటి’గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో నటించిందే లేదు.
ఆమె సహజత్వానికి ప్రతీకగా నిలిచారు. ఇటీవల తమిళంలో ‘అమరన్’ చిత్రంలో నటించి అందరి ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి, తెలుగులో నాగ చైతన్య సరసన నటించిన ‘తండేల్’ చిత్రంలోనూ తనదైన నటనతో ముద్ర వేసుకున్నారు. ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామన్నదే ముఖ్యం అని భావించే సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న భారతీయ ఇతిహాస గాథ ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె నటన ఎంతగా ఆకట్టుకుంటుందో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.