ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేరుతో భారీ సైబర్ మోసం (Cyber Fraud) బయటపడింది. నేరగాళ్లు వాట్సాప్‌లో లోకేష్ ఫోటోతో ఫేక్ ప్రొఫైల్ (Fake Profile) సృష్టించి పలువురిని మోసం చేశారు. టీడీపీ(TDP) నేతగా, NRI కన్వీనర్‌గా పరిచయం చేసుకున్న కొండూరి రాజేష్ (Konduri Rajesh) అనే వ్యక్తి నారా లోకేష్ ఫోటోను వాట్సాప్ డీపీగా ఉపయోగించి ప్రజలను నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ గ్యాంగ్ అమాయక ప్రజల నుంచి మొత్తం రూ.54.34 లక్షలు దోచుకున్నట్టు అధికారులు గుర్తించారు.
సైబర్ నేరగాళ్లు X (Twitter) లో “హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ NCBN, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్” వంటి హాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెడుతూ, వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేస్తామంటూ ప్రజలను ట్రాప్ చేశారు. సాయం కోసం సంప్రదించిన వారికి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి, తాము డబ్బు పంపామని నమ్మించారు. తరువాత “4 శాతం రేమిటెన్స్ ఛార్జీలు చెల్లిస్తే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి” అంటూ బాధితుల నుంచే భారీగా డబ్బు వసూళ్లు చేశారు.
ఈ మోసంలో ముగ్గురు వ్యక్తులు..
నకిలీ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేసి డబ్బుల లాగిన ముఠాలో ముగ్గురు వ్యక్తులు కీలకంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. టీడీపీ నేతగా, ఎన్‌ఆర్ఐ కన్వీనర్‌గా పరిచయం చేసుకున్న కొండూరి రాజేష్ ఈ స్కామ్‌లో కీలకంగా కాగా, గుత్తికొండ సాయి శ్రీనాథ్ ఏ2, చిత్తడి తల సుమంత్ ఏ3గా తేల్చారు. వీరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, మంత్రులు లేదా ప్రజాప్రతినిధుల పేరుతో వచ్చే ఆన్‌లైన్ అభ్యర్థనలను పరిశీలించకుండా డబ్బులు పంపవద్దని హెచ్చరించారు.





 



