నంద్యాల విజయ డెయిరీ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ చైర్మన్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న బోర్డు సమావేశం జరుగుతుండగా, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అక్కడికి చేరుకోవడం వివాదానికి కారణమైంది. తమ అనుబంధ డైరెక్టర్లను బోర్డులో నుంచి తొలగిస్తున్నారని భూమా అఖిల ప్రియ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి అనవసర ఘర్షణలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
విజయ డెయిరీకి సంబంధించిన భూమా అఖిల ప్రియ, చైర్మన్ జగన్ మధ్య ఉన్న వివాదం కొత్తది కాదు. భూమా అఖిల ప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదవి నుంచి తొలగించటంతో ఈ గొడవ మొదలైంది. విఖ్యాత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను కూడా బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటి నుంచి భూమా అఖిల ప్రియ అనుచరులు డెయిరీ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఇటీవల డెయిరీ బోర్డుకు ముగ్గురు డైరెక్టర్లను ఎన్నుకునే ప్రయత్నం సందర్భంగా కూడా నామినేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తాయి. భూమా అనుచరుల నామినేషన్ వేయనివ్వడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదం కారణంగా నామినేషన్ల ప్రక్రియను వాయిదా వేశారు.
బోర్డు మీటింగ్‌తో మరింత ఉద్రిక్తత
ప్రస్తుతం బోర్డు మీటింగ్ నేపథ్యంలో, పోలీసులు భారీగా మోహరించి వివాదం మరింత ముదరకుండా అఖిల ప్రియ అనుచరులను ప్రశాంతంగా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదానికి పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.








