నల్లమలలో టైగర్ హంటర్స్ చొరబాటు

నల్లమలలో టైగర్ హంటర్స్ చొరబాటు

నల్లమల అటవీ ప్రాంతంలో (Nallamala Forest Region) అల‌జ‌డి మొద‌లైంది. అడ‌విలోకి టైగర్ హంటర్స్ (Tiger Hunters) చొరబాటు కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న నాగార్జునసాగర్–శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో అగంతకులు చొరబడినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో నల్లమల అటవీ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినం చేశారు.

అటవీ ప్రాంతంలో అంతర్జాతీయ వేటగాళ్లు ఉపయోగించే పులిపంజా ఉచ్చులు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పెద్దపులులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఈ ఉచ్చులు నల్లమలలో వేటగాళ్ల కదలికలకు నిదర్శనంగా అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో అటవీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు.

గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్య పరిధి (Gundla Brahmeswaram Wildlife Sanctuary)లో అనుమానిత అగంతకుడి కదలికలకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించారు. అక్కడ లభించిన వేలిముద్రలను జాగ్రత్తగా భద్రపరచి, తదుపరి దర్యాప్తు కోసం పంపించారు. వేటగాళ్ల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.

సేకరించిన వేలిముద్రలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు (NCRB) పంపినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే వేటగాళ్ల ముఠా ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలతో ఇతర రాష్ట్రాల అటవీ, పోలీస్ శాఖలతో సమన్వయం చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నల్లమల అడవుల్లో పెద్దపులుల సంరక్షణకు ముప్పుగా మారుతున్న ఈ తరహా చొరబాట్లను అరికట్టేందుకు గస్తీని పెంచిన అధికారులు, సరిహద్దు ప్రాంతాల్లో కఠిన నిఘా ఏర్పాటు చేశారు. వేటగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment