ఓ కేసు విషయంలో పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లి, గిరిజన యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసిన సంఘటన నల్లగొండ (Nalgonda) జిల్లా వాడపల్లి (Vadapalli)లో చోటు చేసుకుంది. పోలీసుల దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిరిజన యువకుడు ధనావత్ సాయి (Dhanavat Sai) సిద్ధు నాయక్ (Siddu Naik)పై స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి (Srikant Reddy), ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి థర్డ్ డిగ్రీ (Third Degree) టార్చర్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
ఓ కేసు నేపథ్యంలో స్టేషన్‌కు తనను లాక్కెళ్లి, విచక్షణారహితంగా కొట్టారని బాధితుడు మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. తీవ్రంగా కొట్టడంతో నడవలేని స్థితికి చేరానని, ఆ సమయంలో కులం పేరుతో దూషించారంటూ వాపోయాడు. తనపై దాడి చేసిన తరువాత కోర్టుకు తరలించే సమయంలో, పెయిన్‌కిల్లర్స్ బలవంతంగా మింగించారని కూడా ఆరోపించాడు. 14 రోజుల రిమాండ్ అనంతరం జైలు నుంచి విడుదలైన సాయి సిద్ధు, బయటికి వచ్చిన తర్వాత తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు.
బాధితుడి భార్య మౌనిక కూడా పోలీసుల దురుసు వైఖరిని ఎండగట్టింది. అరెస్టు సమయంలో అడ్డుకోవడానికి ప్రయత్నించగా తనను నెట్టివేసారనీ, తాను గర్భిణీ అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. గతంలో కూడా ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరులో పనిచేసినప్పుడు, ఒక రైతును విచక్షణారహితంగా కొట్టాడని శ్రీకాంత్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాడపల్లిలోనూ అలాంటి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సబ్ ఇనిస్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ వ్యవహారంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నానని సాయి సిద్ధు నాయక్ మీడియా ఎదుట తెలిపారు.
గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ
— Telugu Feed (@Telugufeedsite) September 23, 2025
ఓ కేసు విషయంలో స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టిన ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఇద్దరు కానిస్టేబుల్స్
నడవలేని స్థితిలో బాధిత యువకుడు, కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగారని బాధితుడి కన్నీరు
తీవ్రంగా కొట్టి కోర్టుకు తరలించే సమయంలో పెయిన్ కిల్లర్స్… pic.twitter.com/Ab0h31hybZ








