‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

‘ఏపీ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది’.. బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత సంచలన లేఖ

అమరావతిలో పెట్టుబడుల అంశంపై ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు టీడీపీ మాజీ నేత, చిలకలూరిపేట వాసి మురళీ చౌదరి సంచలన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తీవ్రమైన పాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని ఆ లేఖలో ఆయన హెచ్చరించడం సంచ‌ల‌నంగా మారింది.

బిల్ గేట్స్ 2026 ఫిబ్రవరిలో అమరావతిని సందర్శించనున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ఆలోచిస్తే ముందు రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను గమనించాలని కోరుతూ మురళీ చౌదరి ఈ లేఖను పంపించారు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ లేఖను ఆయన ‘ఇన్వెస్టర్ అలర్ట్’గా పేర్కొన్నారు.

ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం న‌డుస్తోంది
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’గా పిలవబడుతున్న పాలనా విధానం కారణంగా రాష్ట్రం ప్రజాస్వామ్య విలువలు, సంస్థాగత సమతుల్యత, చట్టపాలన నుంచి దూరమవుతోందన్న ఆందోళన పెరుగుతోందని మురళీ చౌదరి పేర్కొన్నారు.

మీరు ఇలాంటి రాష్ట్రంలో పెట్టుబడి పెడతారా?
ఈ సందర్భంగా బిల్ గేట్స్‌ను ఉద్దేశిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కనపెట్టి నియంతృత్వ నిర్ణయాలు తీసుకునే రాష్ట్రంలో మీరు పెట్టుబడి పెడతారా? చట్టపాలన ఎంపికచేసి మాత్రమే అమలవుతున్న చోట పెట్టుబడులు సురక్షితమా? మాట స్వేచ్ఛను, భిన్నాభిప్రాయాలను అణిచివేసే పరిస్థితుల్లో వ్యాపార వాతావరణం ఎలా ఉంటుందన్న ప్రశ్నను ఆయన సంధించారు.

రాజకీయ బెదిరింపులు, హింస సాధారణమవుతున్నాయనీ, భూసేకరణలో పారదర్శకత, న్యాయ ప్రక్రియలు పూర్తిగా లోపిస్తున్నాయనీ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, మాదకద్రవ్య ముఠాలు శిక్షలేమితో పనిచేస్తూ సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితులపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదని, అది తీవ్రమైన పాలనా మరియు నైతిక ప్రమాదాలను కూడా మోస్తుందని స్పష్టం చేశారు.

సూక్ష్మమైన హెచ్చరిక
సూత్రబద్ధమైన పెట్టుబడిదారులకు, ముందస్తుగా అంచనా వేయగల పాలన ఉన్న సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలు కూడా, ప్రస్తుత మార్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే స్థిరంగా అనిపించే పరిస్థితి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. ఈరోజు మౌనంగా ఉండే ఖర్చు, రేపు అస్థిరతగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తూ.. “వివేకంగా ఎంపిక చేయండి, గౌరవాన్ని ఎంపిక చేయండి, నైతికతను భారం గా చూడని పాలనను ఎంపిక చేయండి” అంటూ లేఖను ముగించారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో, పెట్టుబడుల వాతావరణంపై పెద్ద చర్చకు దారి తీస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment