భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డ్ మెంబర్, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గత రెండ్రోజులుగా చర్చనీయాంశంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కొనసాగుతూ భగవద్గీత వల్ల బతుకులు మారలేదని ఆయన చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది. సనాతన ధర్మ పరిరక్షకులంతా టీడీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌ను ముక్తకంఠంతో ఖండించారు. దీంట్లో బీజేపీ శ్రేణులే అధికంగా ఉన్నారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వ్యక్తిని టీటీడీ బోర్డు మెంబర్‌గా పెట్టొచ్చా అంటూ పొరుగు రాష్ట్రం నేత ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంఎస్ రాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు అధికమయ్యాయి.
తిరుమల తిరుపతి ఆలయ బోర్డ్ మెంబర్‌గా ఉంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఓ వీడియో విడుదల చేసి అందరూ ఆశ్చర్యపోయేలా వివరణ ఇచ్చారు. భగవద్గీతపై అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు, విశ్వహిందూపరిషత్ సభ్యులు ఖండించగా, ఆ నెపాన్ని వైసీపీపైకి తోసేశారు.
మొంథా తుపాన్ ప్రభావంతో ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్నసేవలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఈ తరహా కుట్రకు తెర తీసిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీత అనే పదాన్ని ఉచ్ఛరించినట్లుగా వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నా.. దాన్ని ప్రతిపక్ష పార్టీ కుట్రగా చిత్రీకరించడం, దానికి మొంథా తుఫాన్‌కు లింక్ పెట్టడం శోచనీయం అంటున్నారు హిందూ ధర్మ పరిరక్షకులు. బీజేపీ నేతలు ఖండన వీడియోలు కళ్లెదుటే కనిపిస్తున్నా.. తమ క్రెడిట్‌ను వైసీపీకి ఎందుకు ఇస్తున్నారు రాజుగారూ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ నేతలు.





 



