ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శలు గుప్పించారు. 2017లో చంద్రబాబు అధికారంలో ఉండగా జరిగిన సుగాలి ప్రీతి హత్యకేసును ప్రస్తావిస్తూ.. అధికారంలోకి వచ్చాక పవన్ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ 2019, 2024 ఎన్నికల్లోని ప్రతి సభలో ప్రసంగించారని గుర్తుచేశారు.
అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసు టేకప్ చేసి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఉప ముఖ్యమంత్రి అయిన ఈ 9 నెలలు కాలంలో ఏం చేశారని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిందని, ఏపీలో అధికారం మారగానే మిషినరీ లేదు కాబట్టి ఈ కేసు విచారణ చేయలేమని సీబీఐ చేతులెత్తేసిందన్నారు.
పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడి, ఫొటోలు దిగారని, ఎన్నిక సభల్లోనూ సుగాలి ప్రీతి కేసును ప్రస్తావించారని, మరి అధికారంలోకి వచ్చాక ఏం చర్యలు తీసుకున్నారని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. సుగాలి ప్రీతి లాంటి ఘటనలు ఇకపై జరగనివ్వని అని ప్రకటించిన తరువాత.. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే చిన్న పిల్లపై అత్యాచారం జరిగిందని తమ్మారెడ్డి భరద్వాజ గుర్తుచేశారు.
‘ఎన్నికల సమయంలో 30 వేల అమ్మాయిలు మిస్సయ్యారన్నారు వారు ఎక్కడ? సుగాలి ప్రీతికి జరిగిన న్యాయం ఎక్కడ..? పవన్ పట్టించుకుంటున్నారా.. లేక తన శాఖ పరిధిలో లేదని వదిలేశారా..? పవన్ మొదట్నుంచి సుగాలి ప్రీతి అంశం గురించి మాట్లాడుతున్నారు. ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలి.. దోషులకు శిక్షపడాలి.. పవన్ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి, అందులోనూ ప్రామీస్ చేశారు కాబట్టి న్యాయం చేయాలి, ఆయన డ్యూటీ అది’ అని తమ్మారెడ్డి భరద్వాజ గుర్తుచేశారు.








