మాజీ భారత క్రికెటర్ (Cricketer), కాంగ్రెస్ (Congress) నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet)లో మంత్రి (Minister)గా చేరనున్నారు. గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలిసిన అజారుద్దీన్, తనకు లభించిన ఈ అవకాశంపై కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అజారుద్దీన్ మంత్రి పదవిలోకి రావడం అనేది ఓల్డ్ సిటీ పరిధిలో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. ఓల్డ్ సిటీలోని ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి మరియు మైనార్టీ వర్గాల మద్దతును మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ప్రముఖ క్రికెటర్‌గా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజారుద్దీన్, గతంలో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.





 



