బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కల్వకుంట్ల ఫ్యామిలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలోని కొందరు జైలు ఊచలు లెక్క పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్ల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరతీసిందని, దళితబంధులో కమీషన్ తీసుకున్నవాళ్లు కూడా నీతులు మాట్లాడడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఫ్యామిలీకి 2014కు ముందు ఉన్న ఆస్తులు ఎంత..? ఇప్పుడున్న ఆస్తులు ఎంతో ప్రకటించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తికాగానే కేసీఆర్‌తో పాటు హరీష్ కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ కూడా రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇప్పటికే తీహార్ జైలుకు వెళ్లి వచ్చిందని కడియం శ్రీహరి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ పార్టీ శ్రేణులపై అక్రమంగా కేసులు నమోదవుతున్నాయని, రేవంత్ సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఫార్ములా-ఈ రేస్‌లో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.