రాష్ట్రంలో భిక్షాటనను (Begging) పూర్తిగా నిషేధిస్తూ మిజోరాం (Mizoram) అసెంబ్లీ (Assembly) “మిజోరం యాచక నిషేధ బిల్లు (Mizoram Beggar Prohibition Bill), 2025” ను ఆమోదించింది. ఈ బిల్లులో భిక్షాటనను నియంత్రించడం మాత్రమే కాకుండా, యాచకులకు సహాయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి.
విస్తృత శ్రేయస్సే లక్ష్యం
సాంఘిక సంక్షేమ మంత్రి లాల్రిన్‌పుయ్ (Lalrinpuii) తెలిపిన ప్రకారం, మిజోరాం (Mizoram)లో యాచకుల సంఖ్య తక్కువగానే ఉంది. దీనికి ప్రధాన కారణాలు — బలమైన సామాజిక వ్యవస్థ, చర్చిల సహకారం, స్వచ్ఛంద సంస్థల సహాయం, అలాగే ప్రభుత్వ పథకాలు. అయితే, త్వరలో ప్రారంభం కానున్న సైరంగ్-సిహ్ము రైల్వే లైన్ ద్వారా బయట నుంచి ఎక్కువ మంది యాచకులు రాష్ట్రంలోకి రావచ్చని అంచనా.
స్వీకరణ కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక
పిటిఐ నివేదిక ప్రకారం, ప్రభుత్వం ఒక “రిసీవింగ్ సెంటర్” (Receiving Center)ను ఏర్పాటు చేయనుంది. అక్కడ తాత్కాలికంగా యాచకులను ఉంచి, 24 గంటల్లోగా వారికి తగిన సహాయం అందించి, వారి స్వస్థలాలకు పంపించనున్నారు. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌లో ఇటీవల జరిగిన సర్వే ప్రకారం, 30 మందికి పైగా యాచకులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిగా తేలింది.
బిల్లుపై ప్రతిపక్ష అభ్యంతరం
ఈ బిల్లుపై ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. MNF పార్టీకి చెందిన లాల్‌చందమ రాల్టే మాట్లాడుతూ, ఈ చట్టం మిజోరాం ప్రతిష్టను దిగజార్చే అవకాశం ఉందని, అలాగే క్రైస్తవ విలువలకు విరుద్ధమని విమర్శించారు. సమాజం, చర్చిల పాత్రను బలోపేతం చేస్తూ, యాచకులకు సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి స్పష్టం
ముఖ్యమంత్రి లాల్దుహోమా (Laldohoma) ఈ బిల్లు(Bill)ను సమర్థిస్తూ మాట్లాడుతూ, దీని ప్రధాన ఉద్దేశ్యం యాచకులను శిక్షించడం కాదని, వారు స్వావలంబనతో జీవించేలా పునరావాసం కల్పించడమేనన్నారు. చర్చిలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహకారంతో మిజోరాంను “యాచకులు లేని రాష్ట్రం”గా మార్చాలన్నదే లక్ష్యమని వివరించారు.