పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను ఉత్కంఠలోకి నెట్టాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరపగా, ప్రతీకార చర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేపడుతోంది. పైగా హర్ముజ్ జలసంధి మూసివేతతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోవడంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కొరత తలెత్తింది. ఈ పరిస్థితులు ఇప్పుడు భారత్‌ను కూడా ప్రభావితం చేస్తున్నాయి. దేశీయ గ్యాస్ నిల్వలు తగ్గుముఖం పట్టడంతో కేంద్రం ప్రాధాన్యతను గృహ వినియోగదారులకు ఇచ్చి, వాణిజ్య LPG సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. చెన్నై, ముంబైలో గ్యాస్ కొరత కారణంగా పలు హోటళ్ళు మూసివేయాల్సి వచ్చింది.
దేశం లోని కొన్ని పెద్ద నగరాల పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. గ్యాస్ కొరత కారణంగా ముంబైలోని 20 శాతం హోటళ్ళు ఇప్పటికే మూసివేయబడ్డాయని గ్యాస్ హోటల్ అసోసియేషన్ (GAHAAR) వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో ముంబైలోని 50 శాతం హోటళ్ళు మూసివేయాల్సి వస్తుందని అసోసియేషన్ హెచ్చరించింది. రెస్టారెంట్లు, ఆహార సంబంధిత వ్యాపారాలు LPG సరఫరా అంతరాయం వల్ల తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి.








