పటాన్‌చెరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పటాన్‌చెరు పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో తన అనుచరులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అప్పటి పరిస్థితుల దృష్ట్యా తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తనకు “వెంట్రుక వంతు లాభం కూడా జరగలేదని” స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సమావేశానికి హాజరైన కార్యకర్తల్లో చర్చకు దారితీశాయి.
తాను మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేసిన మహిపాల్ రెడ్డి, అదే కారణంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. పార్టీకి తన రాజకీయ ప్రయాణం, కార్యకర్తల కష్టం మర్చిపోలేనిదని చెప్పారు.
పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం 104 కౌన్సిలర్ స్థానాలను గెలిపించడమే లక్ష్యంగా విభాగాల వారిగా సమన్వయంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తన బాధ్యతను గుర్తించి క్షేత్రస్థాయిలో పనిచేస్తే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.








