సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా వచ్చి, గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబం నుంచి మరో నటి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన సోదరి, నటి మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni), స్వరూప్ (Swaroop) దంపతుల కుమార్తె అయిన జాన్వీ స్వరూప్ (Jahnavi Swaroop) టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం కానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
నటనలో శిక్షణ
జాన్వీ స్వరూప్ ఇప్పటికే నటనతో పాటు పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్ వంటి అనేక అంశాలలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. బాల నటిగా పదేళ్ల వయసులోనే తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో నటించి మెప్పించారు. ఆ తర్వాత పలు జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.
తల్లి ఆనందం
దశాబ్దాల క్రితం కృష్ణ(Krishna) అభిమానుల అభ్యంతరాల కారణంగా హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని వదులుకున్న మంజుల, ఇప్పుడు తన కుమార్తె ఎంట్రీ పట్ల అమితానందం వ్యక్తం చేశారు. “అప్పుడు నన్ను వద్దన్న వారే ఇప్పుడు నా కూతురు సినిమాల్లోకి రావాలని కోరుతున్నారు. నా ప్రార్థనలకు నా కుమార్తె చిరునవ్వు సమాధానం” అని మంజుల పేర్కొన్నారు.





 



