అన్న‌దాత‌కు ఆక్రోశం.. గ్రోమోర్ షాపుపై రాళ్ల‌ దాడులు

అన్న‌దాత‌కు ఆక్రోశం.. గ్రోమోర్ షాపుపై రాళ్ల‌ దాడులు

వ్య‌వ‌సాయం ఆధారిత రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యూరియా స‌మ‌స్య రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. బ‌స్తా యూరియా కోసం రైతులు రోజుల త‌ర‌బ‌డి సొసైటీ కార్యాల‌యాలు, మ‌న గ్రోమోర్ సెంట‌ర్ల చుట్టూ తిరుగుతూ, గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో నిల‌బ‌డిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో రోజుల త‌ర‌బ‌డి యూరియా కోసం క్యూలైన్ల‌లో వేచి ఉన్న అన్న‌దాత‌ల‌కు ఆక్రోశం వ‌చ్చింది. దీంతో మ‌హబూబాబాద్ పట్టణం ఉద్రిక్తత వాతావరణంగా మారింది. సూర్య థియేటర్ ఎదురుగా ఉన్న మన గ్రోమెర్ షాపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బస్తాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, షాపుపై రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత షాపు ముందు మంటపెట్టి నిరసన తెలిపారు. మంటలు ఎగిసిపడుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

రాళ్ల దాడిని తట్టుకోలేక షాపు యాజమాని షాపును మూసివేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. రైతులు గోదాం తాళాలు పగలగొట్టి లోపల నిల్వ చేసిన యూరియా బస్తాలను బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతులు, పోలీసులు మధ్య ఘర్షణాత్మక వాగ్వాదం జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, రైతులు తోసిపారేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోదాం వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment