ఏపీలో మ‌రో దారుణం.. ఏడేళ్ల‌ బాలిక దారుణ హత్య

ఏపీలో మ‌రో దారుణం.. ఏడేళ్ల‌ బాలిక దారుణ హత్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో దారుణ‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌హిళ‌లు, చిన్నారుల‌పై రాష్ట్రంలో ఏదో ఒక‌చోట ప్ర‌తి నిత్యం అఘాయిత్యాలు జ‌రుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జ‌రిగిన ఘ‌ట‌న ఆడ‌బిడ్డ‌ల త‌ల్లిదండ్రుల‌కు భయాందోళ‌న క‌లిగిస్తోంది. నిన్న సాయంత్రం ఏడేళ్ల ప‌సి బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచిన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది.

మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో కాట్లాటపల్లి రోడ్డులో నివసిస్తున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (7) సోమవారం సాయంత్రం సుమారు 4.30 గంటలకు కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప‌రిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, బాలికను ఓ వ్యక్తి హత్య చేసి డ్రమ్ములో దాచినట్లు గుర్తించారు. దీంతో అదృశ్యంగా భావించిన కేసు హత్యగా మారింది.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితుడిని అప్పగించే వరకు బాలిక మృతదేహాన్ని తరలించనివ్వమని పట్టుబట్టారు.

పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా, రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దిశ పోలీసులు, దిశ యాప్ ఏమ‌య్యాయి.. క‌నీసం అవైనా ఉంటే ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండేది క‌దా అని కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment