నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత స్టాలిన్ నేతృత్వంలో నేడు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఐటీసీ ఛోళా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధి ఒకరు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల రాజకీయ ప్రముఖులంతా చెన్నై చేరుకున్నారు. కాగా, భేటీకి టీఎంసీ దూరంగా ఉంది.
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలన్న కేంద్ర విధానాన్ని ఈ పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గి, నియోజకవర్గాల్లో నష్టపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే డీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ విషయంలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఫెయిర్ డీలీమిటేషన్ నినాదంతో సమావేశం జరగనుంది. నియోజకవర్గాల పునర్విభజన న్యాయంగా జరగాలన్న బలమైన డిమాండ్‌ను ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా కేంద్రానికి సూచించనట్లు తెలుస్తోంది.