ల‌డ్డూ వివాదం.. CBI రిపోర్ట్‌పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్య‌లు

ల‌డ్డూ వివాదం.. CBI రిపోర్ట్‌పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్య‌లు

తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ కీలక చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ నివేదికతో వివాదానికి తెరపడినట్లే అనిపించినప్పటికీ, టీటీడీ ప్రస్తుత బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి.

సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన బీఆర్ నాయుడు, విచారణ సరిగా జరగలేదని ఆరోపించారు. మైక్రో డీఎన్‌ఏ పరీక్ష చేయలేదని, చార్జ్‌షీట్‌లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. ఈ అంశంపై తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. సీనియర్ న్యాయవాదులు చార్జ్‌షీట్‌ను అధ్యయనం చేస్తున్నారని, శాస్త్రవేత్తలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని, అవన్నీ త్వరలోనే బయటపెడతామని బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో, టీటీడీకి రాజకీయ రంగు పూయడం వివాదాస్పదంగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“వాళ్లు క్రిస్టియన్స్… హిందువులంటే చులకన భావం” అంటూ బీఆర్ నాయుడు చేసిన‌ మ‌త‌ప‌ర‌మైన‌ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి చైర్మన్‌గా ఉన్న వ్యక్తి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు నాయుడు లడ్డూ వివాదంపై ఆరోపణలు చేయకముందు, అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన ప్రకటన, అనంతరం సీఎం ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై విలేకరి ప్రశ్నించగానే, “అది నాకు తెలియదు… నేను అప్పుడు లేను” అంటూ బీఆర్ నాయుడు సమాధానం దాటవేశారు.

అలాగే, లడ్డూ వివాదాన్ని వైవీ సుబ్బారెడ్డి మ్యానేజ్ చేశారన్న ప్రచారంపై ప్రశ్నించగా, బీఆర్ నాయుడు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రతి విషయానికి సీబీఐ ఎంక్వైరీ కోరడం సిగ్గుచేటు” అంటూ వైసీపీ నేత‌లు సీబీఐ విచార‌ణ కోరడాన్ని వ్య‌తిరేకించారు. 13 ఏళ్లుగా కేసులను మేనేజ్ చేస్తున్నారంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని సంపాదించారని, ఆ డబ్బులతోనే వ్యవహారాలు నడిపిస్తారని వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేవుడి క్షేత్రంలో ఉండి ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని, బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment