ఫార్ములా ఈ-కార్ రేస్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈనెల 6వ తేదీన ఏసీబీ విచారణకు తన లీగల్ టీమ్ బయల్దేరిన కేటీఆర్‌ను పోలీసులు మధ్యలోనే ఆపి లాయర్లను అనుమతించమని చెప్పడంతో ఆయన విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. వకీల్ ఉంటేనే విచారణకు వస్తానని ఏసీబీకి తెగేసిచెప్పారు. ఏసీబీ అందుకు అనుమతివ్వకపోవడంతో కేటీఆర్ హైకోర్టులో లంచ్‌మోషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటీషన్ విచారణ చేపట్టిన కోర్టు.. ఏసీబీ విచారణకు న్యాయవాదితో వెళ్లేందుకు కేటీఆర్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆదేశించింది. విచారణ సమయంలో లైబ్రరీ రూమ్‌లో కూర్చొని లాయర్ సీసీ టీవీ ద్వారా పర్యవేక్షించవచ్చని, కేటీఆర్ ఓ గదిలో, న్యాయవాది మరో గదిలో ఉండాలని హైకోర్టు ఏసీబీకి సూచించింది. అయితే ఆడియో, వీడియో రికార్డింగ్‌కు మాత్రం ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు.
ఇదే కేసులో ఏ2, ఏ3లుగా ఉన్న అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల వాంగ్మూలాలను ఏసీబీ రికార్డ్ చేసింది. వారి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.