తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కె. స్టాలిన్ (MK Stalin) చేసిన కీలక వ్యాఖ్యలను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పూర్తిగా సమర్థించారు. దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల అన్యాయానికి గురవుతాయనే విషయాన్ని ఆయన మద్దతు తెలిపారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. “దేశానికి అవసరమైన సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను కచ్చితంగా అమలు చేశాయి. కానీ ఇప్పుడు అదే విధానం వల్ల వీటికి నష్టమే జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెద్ద దెబ్బ” అన్నారు. అంతేకాదు, దేశ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా సహకరించే రాష్ట్రాల అభిప్రాయాల ఆధారంగా పునర్విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభన చేయాలని నిశ్చయించుకుంటే దేశానికి అందించే ఆర్థిక సహకారం వాటా ఆధారంగా చేపట్టాలని ప్రతిపాదించారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 2.8 శాతం మాత్రమే ఉందని.. కానీ, దేశ జీడీపీలో మాత్రం 5.2 శాతం కంటే ఎక్కువ వాటా అందిస్తోందన్నారు.