తెలంగాణ (Telangana) రాజకీయాల్లో (Politics) మళ్లీ వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President) కేటీఆర్ (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా రేవంత్ రెడ్డి మోసాలు ఎక్కువ” అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో పలువురు నేతలు బీఆర్ఎస్(BRS)లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
“స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్‌కు టర్నింగ్ పాయింట్”
కేటీఆర్ మాట్లాడుతూ, వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు (Local Body Elections) బీఆర్ఎస్‌కు ప్రీ-ఫైనల్స్ లాంటివని అన్నారు. కార్యకర్తలందరూ ఇప్పటి నుంచే ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ మళ్లీ సీఎం కావడానికి మార్గాన్ని తెరుస్తాయని చెప్పారు. అభ్యర్థుల ఎంపికకు స్థానిక నేతల ఏకాభిప్రాయాన్ని తీసుకోవాలని సూచించారు.
“ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ మోసాలు వెల్లడించండి”
కాంగ్రెస్ పార్టీ పాలన మోసాలతో నిండిపోయిందని ఆరోపించారు. “రేషన్ కార్డుల విషయంలో గొప్పలు చెప్పే అవసరం లేదు. మేమే 6.5 లక్షల కార్డులు ఇచ్చాం” అని గుర్తుచేశారు. “పాలిచ్చే బర్రెను కాదని తన్నే దున్నపోతు తెచ్చుకున్నాం. ప్రభుత్వం ఒక్కో ముసలమ్మకు రూ.40,000 బకాయి ఉంది. ఓట్లు వేయాలనేప్పుడే రైతుబంధు పేరిట చిల్లర పంచుతున్నారు” అని విమర్శించారు.
“రాష్ట్రాన్ని నడిపే నైపుణ్యం లేక రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఏడుస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని ధీమా వ్యక్తం చేశారు. “ఎవరు గాడిదో.. ఎవరు గుర్రమో ప్రజలకే తెలుసు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వంలోకి రాగానే సమ న్యాయం చేస్తాం”
మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ, పార్టీ వ్యవస్థల మధ్య సమన్వయం తీసుకొస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. “ఈసారి ప్రజలు గుండె చప్పుడు వినిపించేలా తీర్పు ఇస్తారు” అంటూ ధీమా వ్యక్తం చేశారు.







