ల‌గ‌చ‌ర్ల రైతుల‌పై దాడి.. ఎవ్వ‌రినీ వ‌ద‌లం – కేటీఆర్ హెచ్చ‌రిక

ల‌గ‌చ‌ర్ల రైతుల‌పై దాడి.. ఎవ్వ‌రినీ వ‌ద‌లం - కేటీఆర్ హెచ్చ‌రిక

తెలంగాణలోని లగచర్ల రైతులపై పోలీసుల దాడి వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖ‌రి బ‌య‌ట‌ప‌డింద‌ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక రేవంత్ రెడ్డి సర్కార్‌కు చెంపచెళ్లుమనేలా ఉందని ఆయన మండిపడ్డారు. లాక‌ప్‌లో సీసీ కెమెరాలు ప‌నిచేయ‌కుండా చేసి రైతుల‌ను విప‌రీతంగా కొట్టార‌ని, సొంత నియోజకవర్గ రైతులను దారుణంగా కొట్టించిన రేవంత్ రెడ్డికి సిగ్గు, ఇజ్జత్ ఉంటే ఈపాటికి రాజీనామా చేయాల‌ని, కానీ రేవంత్‌రెడ్డికి ఇజ్జ‌త్ లేద‌న్నారు.

హైదరాబాద్‌లోని నందినగర్ నివాసం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. “లగచర్ల ఘటనలో 40 మంది బాధితుల‌ను అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆ రైతులను చిత్రహింసలు పెట్టారు. హీర్యానాయక్ అనే రైతు గుండె నొప్పితో బాధపడుతుండగానే, అతడిని సంకెళ్లతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇది మానవత్వానికి అవమానం. పోలీసులు మానవ మృగాల్లా ప్రవర్తించారు” అని విమర్శించారు.

అలాగే గిరిజన మహిళలను జాతీయ మానవ హక్కుల కమీషన్, ఎస్సీ/ఎస్టీ కమిషన్లకు తీసుకెళ్లినట్లు తెలిపారు. “ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. లగచర్లలో భూ సేకరణ తక్షణమే నిలిపివేయాలి” అని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై లైంగిక దాడి చేశారని లగచర్ల మహిళలు NHRC బృందానికి తెలిపారన్నారు. రాత్రిపూట గ్రామంపై పోలీసులు దాడి చేసి మహిళల తొడలపై దారుణంగా కొట్టినట్టు జడ్జి ముందు చెప్తే ఇంకా దారుణంగా కొడతామని బెదిరించారని గిరిజన మహిళలు NHRC వాళ్లకు చెప్పారని రిపోర్ట్‌ను కేటీఆర్ చ‌దివి వినిపించారు.

కేటీఆర్ హెచ్చరిస్తూ “రైతులపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం. రేవంత్ రెడ్డి కొడంగల్ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ సిగ్గుపడాలి. లగచర్ల ఘటనపై ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి” అని చెప్పారు. ఇక లగచర్లలో బెదిరింపులు, దాడుల‌కు పాల్ప‌డిన అధికారుల‌కు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధికారులను వదిలిపెట్టం. వారు రిటైర్డ్ అయినా సరే, పట్టుకుని శిక్షిస్తాం అని కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చ‌రించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment