తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనేక దౌర్జన్యాలు చేసినప్పటికీ, బీఆర్ఎస్(BRS)కు మద్దతు ఇచ్చిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ధైర్యంగా పోరాడి గెలిచినందుకు కేటీఆర్(KTR) ఎక్స్ లో అభినందనలు తెలిపారు. హత్యారాజకీయాలు, అరాచకాన్ని కూడా ఎదుర్కొని నిలబడ్డ గులాబీ కార్యకర్తలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల పర్యటనల పేరిట చేసిన ప్రచారం కూడా పెద్దగా ఫలించకపోవడం, కాంగ్రెస్ 44 శాతం సీట్లను కూడా దాటకపోవడం ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినప్పటికీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై (Revanth Reddy Government) ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్టు ఫలితాలు చూపిస్తున్నాయని కేటీఆర్ ట్వీట్‌లో అన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ మాత్రమే నిలిచిందని, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని కూడా ఈ ఫలితాలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. పల్లెల్లో అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ప్రతికూల ఫలితాలను తెచ్చినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వంచనలు, ఆరు గ్యారెంటీల మోసం, పెన్షన్ పెంపులో మోసం, మహాలక్ష్మి, తులం బంగారం వంటి హామీల దగా రైతులు, గ్రామీణ ప్రజలు మరచిపోలేదని కేటీఆర్ అన్నారు. యూరియా కొరత, బోనస్ హామీ అమలు కాలేకపోవడం, పంట అమ్మకాల్లో ఇబ్బందులు అన్నీ కలిసి కాంగ్రెస్‌పై ప్రజ కోపాన్ని పెంచాయని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఆరంభమేనని, కాంగ్రెస్ పతనం ఇక్కడి నుంచే మొదలై మరింత వేగంగా కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా (Pink Flag) ఎగరవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.








