మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు మూటగట్టుకున్న ప్రభుత్వం ఓటమి భయంతోనే మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణ ఎన్నికల్లోనూ తప్పదనే ఆందోళనతో అడుగడుగునా దౌర్జన్యాలకు దిగారని మండిపడ్డారు.
అక్రమంగా సేకరించిన నిధులతో ప్రజాతీర్పును ప్రభావితం చేయాలనే కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి బీఆర్ఎస్ శ్రేణులపై వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొంటూ, ఎన్ని నిర్బంధాలు వచ్చినా ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇదే విషయంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఘాటుగా స్పందించారు. నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్ ముగిసేంతవరకు అధికార పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరించడం, భౌతిక దాడులకు దిగడం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. చట్టాన్ని లెక్క చేయకుండా కొందరు పోలీసుల తీరూ గర్హనీయమని పేర్కొన్నారు. గెలుపు కోసం ఇలాంటి నీచ రాజకీయాలకు దిగడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని అన్నారు. కఠిన పరిస్థితుల్లో కూడా పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలను హరీశ్‌రావు అభినందించారు.








