తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“తెలంగాణను ఫైళ్లతో కాదు.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారు” అని వ్యాఖ్యానించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి చేసిన పనులు మూడేనని ఎత్తిచూపారు:
- ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం
- ఢిల్లీకి వెళ్లడం
- ఖాళీ చేతులతో తిరిగి రావడం
కేటీఆర్ ఆరోపించిన విధంగా, రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర లేదు, యూరియా లభ్యం కాదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల మరమ్మతులను అడ్డుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ శాశ్వత నష్టాన్ని ఎదుర్కొనబోతోందని, కానీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆ అంశంపై చింత లేదని ఎద్దేవా చేశారు.
“రెండు లక్షల ఉద్యోగాల మాట లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, రూ.4 వేల ఫించన్ గల్లంతైంది, గురుకుల విద్యార్థుల కష్టాలు పట్టించుకునే సానుభూతి లేదు.. కానీ సీఎం మాత్రం మూడు రోజుల్లో మూడు సార్లు ఫ్లైట్ ఎక్కుతున్నారు” అని కేటీఆర్ మండిపడ్డారు.
“ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు వచ్చిన లాభం ఏంటి?” అని కేటీఆర్ ప్రశ్నించారు. “నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ! మనకు పాలకుడు కావాలి.. కానీ టూరిస్ట్ సీఎం వచ్చింది!” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.