తెలంగాణ రాష్ట్రంలో (Telangana State)చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయని, బీఆర్ఎస్ ((BRS) కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధిస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు. చిన్నకాపర్తిలో (Chinnakaparthi) బ్యాలెట్ పేపర్లు (Ballot Papers) పడేసిన ఘటనను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో 100 నుంచి 150 గ్రామాల్లో బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినట్లు ప్రకటించారని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఖచ్చితంగా కోర్టుకు(Court) వెళ్తామని స్పష్టం చేశారు. భువనగిరిలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
పార్టీ ఫిరాయింపులు స్పీకర్‌కు కనబడటం లేదని, పార్టీ మారిన వాళ్లే బహిరంగంగా చెప్పుకున్నా స్పీకర్‌కు వినిపించడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం ఆయనకు లేదన్నారు. కేసీఆర్ హయాంలో కేంద్రం ఇచ్చిన ఉత్తమ పంచాయతీల అవార్డుల్లో తెలంగాణకే 30 శాతం వచ్చాయని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారని, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ సంక్షేమ పథకం ఆగలేదన్నారు. రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ గెలిచిన చోట్ల సంక్షేమ పథకాలు అమలు చేయబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారని ఆరోపిస్తూ, అది రేవంత్ అత్త సొమ్ము కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రతీ జిల్లాలో లీగల్ సెల్ (Legal Cell) ఏర్పాటు చేస్తామని, సర్పంచులపై కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. నాలుగు వేల కోట్లతో 36 మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు నిర్మించామని, ఇప్పుడు లక్షా యాభై వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.








