జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోరబండలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోరబండ ప్రజల స్వాగతం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, మెజారిటీ గురించే చూడాల్సి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన తులం బంగారం, స్కూటీలు వంటి హామీలను పూర్తిగా మర్చిపోయిందని, హైదరాబాద్‌లో ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఆడబిడ్డలను, ఆటో వాళ్ళను మోసం చేశారని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ పరిసరాల్లో సున్నం చెరువు పక్కన ఇళ్లను కూల్చివేయడాన్ని ప్రస్తావిస్తూ “కారుకూ బుల్డోజర్‌కు జరుగుతున్న ఈ పోటీలో కారు ఎలాగైనా గెలవాలి” అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి పంపడానికి డబ్బులు ఉన్నాయని, కానీ జూబ్లీహిల్స్ మహిళలకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు లేవంటున్నారని విమర్శించారు.
తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు లేవు కానీ ‘లూటిఫికేషన్’ నడుస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా, మాగంటి సునీత కన్నీళ్లను కూడా కాంగ్రెస్ మంత్రులు అవమానించారని, ఇది దుర్మార్గమన్నారు. ఓటేయకుంటే పథకాలు బంద్ చేస్తానని సీఎం బెదిరిస్తున్నారని, అది ప్రజల సొమ్ము, నీ సొమ్ము కాదని కేటీఆర్ హెచ్చరించారు. “సునీతను గెలిపిస్తే, పథకాలు ఎలా ఇయ్యవో గల్లా పట్టి అడుగుతాం” అని ప్రజలకు హామీ ఇచ్చారు.








