తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బహిరంగ చర్చకు మరోసారి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్ సోమాజీగూడ (Somajiguda) ప్రెస్‌క్లబ్ (Press Club) చేరుకున్నప్పటికీ.. చర్చకు సీఎం రాలేదు. దీంతో మంత్రులు అయినా చర్చకు రావొచ్చని బీఆర్ఎస్ మరో ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి సవాల్ విసిరి చర్చకు రాకుండా తప్పించుకున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ సవాళ్లు, ఆరోపణలు
ప్రెస్‌క్లబ్‌లో భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి ‘బేసిక్ నాలెడ్జ్’ (Basic Knowledge) లేదని కేటీఆర్ విమర్శించారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ‘రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదు’ అని, గతంలో తాను సవాల్‌ను స్వీకరించినా ఆయన చర్చకు రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం మంత్రులైనా వస్తారని ఆశించామని తెలిపారు.
తెలంగాణ నిధులు ఢిల్లీ (Delhi)కి తరలిపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పట్ల గౌరవం లేదని, ఢిల్లీకి ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసం అని అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. ‘రైతుబంధు (Rythu Bandhu) అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. కొడంగల్‌లో ఎంత మంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్ రెడీగా ఉంది’ అని పేర్కొన్నారు. రైతుల మరణాల జాబితా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితి ఆనాటి ఎమర్జెన్సీని తలపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ తాజా సవాల్
“ఇప్పటికైనా మరోసారి సవాల్ చేస్తున్నా. రేవంత్‌తో చర్చకు సిద్ధం. ప్లేస్ ఎక్కడో డిసైడ్ చేయాలని సవాల్ చేస్తున్నా. డేట్ కూడా మీరే ఫిక్స్ చేయండి.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. చర్చ కోసం రేవంత్ ఇంటికి రమ్మన్నా వెళ్తాం” అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. “రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు. మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి. లేదంటే క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో సీఎం రేవంత్‌కు ఉద్దేశించి ఖాళీ కుర్చీని కూడా ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ నేతల కౌంటర్
మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకుని బీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు. “అసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రమ్మంటే బీఆర్‌ఎస్ నేతలు పారిపోతున్నారు. సభ పెట్టేందుకు కేసీఆర్‌తో లేఖ రాయించండి” అని అన్నారు. “9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. బీఆర్‌ఎస్ మాటలపై చర్చ పెడదాం” అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
ప్రెస్‌క్లబ్ వద్ద ఉద్రిక్తత
కేటీఆర్ ప్రెస్‌క్లబ్‌కు చేరుకునే ముందు, తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను మర్చిపోయిందని, 18 నెలలుగా అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు. అడ్డగోలు హామీలతో రైతులను, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చ పెట్టరని, మైక్ కూడా ఇవ్వరని విమర్శించారు. “దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. రేవంత్ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నాను. రేవంత్ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులైన వస్తారేమో చూస్తాం. మంత్రులతోనైనా మేం చర్చలకు సిద్ధం” అని కేటీఆర్ అన్నారు. ఈ పరిణామాలతో సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.








