ఫార్ములా – ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేయగా, హైకోర్టు కేటీఆర్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఇలాంటి పిటిషన్లలో కుదరదని, చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. దీంతో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ కేసులో తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కేవీయట్ వేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసు పరిణామాలపై ఏసీబీ కార్యాలయంలో అధికారులు కీలక భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఈవో, హెచ్‌డీఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై, కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం.