తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) రాజకీయాల్లో (Politics), ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha), మురళి (Murali) ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)తో కొండా దంపతులు (కొండా సురేఖ, కొండా మురళి) ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ భేటీ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, మీనాక్షి నటరాజన్‌కు 16 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో వరంగల్ జిల్లా (Warangal District)లో కొనసాగుతున్న గ్రూప్ రాజకీయాల గురించి వివరించినట్లు సమాచారం. తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు ఇద్దరూ వివరణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఇంచార్జ్‌కు అందజేశారు. “నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరి తప్పు ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాలని” వారు కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందే తాము రాజీనామా చేసినట్లు నివేదికలో స్పష్టం చేశారు. నాయినీ రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) చేసిన వ్యాఖ్యలను కూడా మీనాక్షి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
కొండా మురళి కీలక వ్యాఖ్యలు:
అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా మురళి, తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని అన్నారు. “గత 44 ఏళ్లుగా నా రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది. వైఎస్‌ఆర్ హయాం నుంచి మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. నేను ఎవరి గురించీ వ్యాఖ్యానించను. నాకు ప్రజాబలం ఉంది. పనిచేసే వారిపైనే విమర్శలు వస్తాయి. క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉన్నా నన్ను రెచ్చగొడుతున్నారు. నేను మొదటిసారి కాంగ్రెస్ ఇంచార్జ్‌ను కలిశాను. రేపటి సభకు వరంగల్ నుండి ఎంత జనసమీకరణ చేయాలనే దానిపై చర్చించుకున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
కొండా మురళి తన లక్ష్యాలను కూడా స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీని బతికించడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేలా చూడడం నా లక్ష్యం. బీసీ బిడ్డగా పీసీసీకి నేను అన్ని రకాలుగా మద్దతు ఇస్తాను” అని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మెజారిటీ స్థానాల్లో గెలిపించే బాధ్యత తనదేనని కొండా మురళి ధీమా వ్యక్తం చేశారు. “రేపు ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యత నాదే. నేను ఎవరికీ భయపడను. బీసీ కార్డుతోనే పనిచేస్తా.. బీసీల అభ్యున్నతికి పనిచేస్తాను” అని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటున్నానని వివరించారు. “నాకు భయం లేదని మొదటి నుంచి చెబుతున్నాను. పెద్ద పెద్ద కేసులకే నేను భయపడలేదు. అదే సమయంలో నాపై ఆరోపణలు చేస్తున్నవారు కూడా నాకు భయపడరు. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. నా కూతురు ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుసు? నా కూతురు భవిష్యత్తు ఆమెనే నిర్ణయించుకుంటుంది. మాది పరకాల.. వంశపారంపర్యంగా పరకాల అడిగితే తప్పేంటి? భవిష్యత్తులో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం” అని కొండా మురళి వ్యాఖ్యానించారు.