గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana) రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎమ్మెల్యే కోమటిరెడ్డి (Komatireddy) రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) సంచలనాలకు కేరాఫ్‌గా మారారు. తన సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. సంస్థాన్ నారాయణపురం (Narayana Puram)లో మాట్లాడిన ఆయన, “మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను, మళ్లీ ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను” అంటూ వ్యాఖ్యానించారు.
మునుగోడు ప్రజల కోసం నా త్యాగం
రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఎల్బీ నగర్ (LB Nagar) నుంచి పోటీ చేసి ఉంటే నాకు మంత్రి పదవి వచ్చేది. కానీ, మునుగోడు ప్రజల కోసం ఆ అవకాశం వదులుకున్నాను. పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. భువనగిరి (Bhuvanagiri) ఎంపీగా గెలిపించిన తర్వాత కూడా అదే చెప్పారు. కానీ నాకు పదవి కాదు, ప్రజల ఆత్మవిశ్వాసమే ముఖ్యం” అని అన్నారు.
“పదవుల కోసం కాళ్లు మొక్కే వాడిని కాదు”
“నాకు మంత్రి పదవి వస్తే ఇంకా ఎక్కువ సేవలు చేయగలగనన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ నేను పదవుల కోసం కాళ్లు మొక్కే వాడిని కాదు. ఎప్పుడూ స్వాభిమానం కోల్పోని రాజకీయ నాయకుడిని. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ఎప్పుడూ చేయను” అని తేల్చిచెప్పారు. “తెలంగాణ ఉద్యమంలో ఉన్న నేను.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న నేను.. అయినా, నన్ను పక్కనబెట్టి వేరే పార్టీల నుంచి వచ్చినవారికి పదవులు ఇచ్చారు. నాకన్నా చిన్నవారికి పదవులు ఇచ్చారు. మీరు ఎంపీగా గెలవాలంటే గెలిపించా. కానీ, పదవి కోసం మనసు దిగజార్చుకోవడం నాకు రాదు” అంటూ సొంతపార్టీపై సెటైర్లు వేశారు.