ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల (Government Medical Colleges) టెండర్ల (Tenders) వ్యవహారం రోజు రోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఆదోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి దాఖలైన టెండర్‌పై చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం తీరును వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్రంగా ప్రశ్నించారు. నాలుగు మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలవగా, ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ (KIMS) ఆసుపత్రి టెండర్ దాఖలు చేసిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అయితే ఈ ప్రచారానికి కిమ్స్ యాజమాన్యం తీవ్ర షాక్ ఇచ్చింది. ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి తాము ఎలాంటి టెండర్లలోనూ పాల్గొనలేదని స్పష్టంగా ప్రకటన విడుదల చేసింది.
దీంతో ప్రభుత్వ వాదన పూర్తిగా బలహీనపడింది. దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav) … కిమ్స్ కాదు, అక్కడ పనిచేసే డాక్టర్ ప్రేమ్ చంద్ షా (Dr. Prem Chand Shah) వ్యక్తిగతంగా టెండర్ వేశాడని, ఇది కేవలం చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని వివరణ ఇచ్చారు.
బాత్రూములు కడిగే వ్యక్తి ఉన్నాడు.. – పేర్ని
ఈ నేపథ్యంలో తాజాగా రంగంలోకి దిగిన పేర్ని నాని ప్రభుత్వ వివరణను పూర్తిగా ఖండించారు. దేశవ్యాప్తంగా ఉన్న 26 కిమ్స్ ఆసుపత్రుల్లో తాను తన అనుచరులను పంపించి విచారణ చేయించానని, ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ ఎక్కడా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. కిమ్స్ ఆసుపత్రుల్లో అటువంటి పేరు గల డాక్టర్ లేదని తేలిందని తెలిపారు. “డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తే లేని పరిస్థితిలో టెండర్ ఎలా వేశారు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎక్కడో ఒక కిమ్స్‌లో బాత్రూంలు కడిగే (Bathroom Cleaning) ప్రేమ్ చంద్ ఉన్నాడని, అతని పేరు చివర షా లేదన్నారు.
ఇదే సందర్భంలో పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూములు కడిగే వ్యక్తితో ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారా.. ఇదే టీడీపీ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా” అంటూ సెటైర్లు వేశారు. గతంలో ‘చంద్రబాబు వంట మనుషులతో ఎంఓయూ చేసుకున్నాడు’ అని తాజాగా కేసీఆర్(KCR) వ్యాఖ్యానిస్తే విమర్శించినవారే, ఇప్పుడు ఈ వ్యవహారానికి ఏమని సమాధనామిస్తారని ప్రశ్నించారు. కిమ్స్ సంస్థ అధికారికంగా ‘ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ మా ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు’ అని లేఖ విడుదల చేస్తే, తాను చంద్రబాబు నాయుడికి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెబుతానని పేర్ని నాని సవాల్ విసిరారు.








