ప్రముఖ నటుడు, ఆర్ట్ డైరెక్టర్ దినేశ్ మంగళూరు (50) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ‘KGF’ సినిమాలో బాంబే డాన్ ‘శెట్టి’ పాత్రలో నటించి దినేశ్ మంగళూరు ప్రత్యేక గుర్తింపు పొందారు. తన సహజ నటనతో ప్రేక్షకుల మదిలో ముద్ర వేశారు. ఆ పాత్ర ఆయనకు విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఆర్ట్ డైరెక్టర్గా ప్రత్యేక ముద్ర
నటుడిగానే కాకుండా ఆర్ట్ డైరెక్టర్గా కూడా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీర మదకరి, చంద్రముఖి ప్రాణసఖి, రాక్షస వంటి చిత్రాల్లో ఆర్ట్ డైరెక్టరుగా తన ప్రతిభను చాటుకున్నారు. దినేశ్ మంగళూరి మరణం కన్నడ సినీ ప్రపంచానికి పెద్ద నష్టమని పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు సినీ ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.








