తాడిపత్రిలో(Tadipatri)అధికార టీడీపీ (TDP), ప్రతిపక్ష వైసీపీ (YSRCP)నేతల మధ్య వైరం కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy)తన నియోజకవర్గానికి దూరమయ్యారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) ఆయన రాకను అడ్డుకుంటుండగా, పెద్దారెడ్డి హైకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు కోర్టు అనుమతులు ఇచ్చింది.
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తాడిపత్రిలో రక్షణ కల్పించాలని పోలీసులను (Police) ఆదేశించింది. కోర్టు అనుమతితో కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నియోజకవర్గంలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతుండగా, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి వస్తే తిరిగి వెళ్లలేడు అంటూ బహిరంగంగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే ఇంటి సమీపంలో కొందరు టిప్పర్ వాహనంలో రాళ్లను గుట్టలుగా పడేసి వెళ్లిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. జేసీ వివాదాస్పద వ్యాఖ్యలతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు మంగళవారం లేఖ (Letter) రాశారు. తాడిపత్రికి వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఇచ్చిందని, తనకు భద్రత కల్పించాలని పోలీసులకు ముందస్తు సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తన నియోజకవర్గానికి వెళ్తున్నానని డీఐజీ (DIG), ఎస్పీ (SP)లకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి లేఖతో తాడిపత్రిలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వైరం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి 8వ తేదీన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.