కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై జస్టిస్ (Justice) పినాకి చంద్ర ఘోష్ (Pinaki Chandra Ghosh) కమిషన్ (Commission) ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ (Petition) దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Aparesh Kumar Singh), జస్టిస్ మొహియుద్దీన్ (Mohiyuddin) నేడు మరోసారి విచారణ చేపట్టారు.
ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) హైకోర్టుకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున తీసుకున్న నిర్ణయాన్ని కాపీ రూపంలో కూడా హైకోర్టుకు అందజేశారు.
హైకోర్టు ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానం:
గత విచారణలో, హైకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు సంధించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు, మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారికంగా మీడియాకు నివేదికను ఇచ్చారా? లేకపోతే వారికి ఎలా లభించింది? అని నిలదీసింది. దీనికి సమాధానంగా, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని బదులిచ్చారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడంతో, కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.
ప్రస్తుతం కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నందున, నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపి, ఆ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ఏజీ స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.