తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) పెను మార్పులు జరగనున్నాయా..? గులాబీ బాస్ మళ్లీ యాక్టివ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా..? అంటే అవును అంటున్నాయి బీఆర్ఎస్(BRS) వర్గాలు. ఇవాళ తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (Kalvakuntla Chandrashekar Rao – KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభా పక్షం (ఎల్పీ) సమావేశం (BRS Legislative Party Meeting), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ (State Executive Joint Meeting) జరగనుంది. ఈ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో ప్రధానంగా ఏపీ జల దోపిడీ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) నిర్లక్ష్య వైఖరిపై కేసీఆర్ తీవ్రంగా మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం మరోసారి ప్రజలను ఉద్యమ బాట పట్టించే అంశంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. “తెలంగాణ నీటి హక్కుల కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాలి” అనే స్పష్టమైన సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చే అవకాశముంది.
ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru–Rangareddy Project) కేవలం 45 టీఎంసీల నీటికి మాత్రమే ఒప్పుకోవడంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయనున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 91 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లిందని కేసీఆర్ విమర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే నదుల అనుసంధానం పేరుతో ఏపీకి జలాలు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై కేంద్రం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలపై రాజకీయంగా గట్టి పోరాటానికి పార్టీ సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఇదే సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై ఉద్యమాల రూపకల్పన వంటి కీలక అంశాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సాయంత్రం ఎర్రబెల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్, పార్టీ శ్రేణులతో కీలక చర్చలకు సిద్ధమయ్యారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కార్యాచరణ మరింత దూకుడుగా మారనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








