గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కావటి మనోహర్ నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తనను అవమానిస్తోందని, మేయర్ కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ సైతం తీసేశారని మనోహర్ నాయుడు ఆరోపించారు. స్టాండింగ్ కమిటీ సమావేశం విషయంలోనూ అవమానం జరిగిందని, గతంలో మేయర్ స్థాయి వ్యక్తి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదని, అవమానాలు భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లుగా వివరించారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తనను ఎంతగానో అవమానించిందన్నారు. మేయర్ ఛాంబర్‌కు ఇవ్వాల్సిన సిబ్బందిని కూడా కుట్రపూరితంగా తొలగించారన్నారు. ఈనెల 17న స్టాండింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నామని అధికారులు తనకు సమాచారం ఇచ్చినప్పటికీ, కమిటీ చైర్మన్‌గా ఉన్న తనకు తెలియకుండా కమిటి ప్రతిపాదనలు, మీటింగ్ సమయం నిర్ణయిస్తున్నారన్నారు. తన ఛాంబర్‌కు తాళం వేసి, తాను వెళ్తే లాక్ ఓపెన్ చేయకుండా అధికారులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జరుగుతున్న ఘోరాలు చూడలేక మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని, రాజీనామా పత్రాన్ని కలెక్టర్‌కు పంపతున్నట్లు మనోహర్ నాయుడు వివరించారు.