శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనపై దేవాదాయశాఖ అధికారికంగా స్పందించింది. ఈ ఘటనకు తమ శాఖకు ఎలాంటి సంబంధం లేదని, అది పూర్తిగా ప్రైవేట్ ఆలయం అని అధికారులు స్పష్టం చేశారు.
దేవాదాయశాఖ ప్రకారం, క్యూలైన్‌లో మహిళల మధ్య జరిగిన గొడవతోనే తోపులాట మొదలై, కొద్దిసేపటిలోనే అది పెద్ద తొక్కిసలాటగా మారింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా భక్తులు మృతి చెందగా, 15 మందికి పైగా స్మృహ కోల్పోయినట్లు సమాచారం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఆలయం కేవలం ఈ సంవత్సరం జూలైలోనే ప్రారంభించబడిందని, తిరుమలలో కొంత అసంతృప్తితో ఒడిషా రాజకుటుంబం ఈ ఆలయాన్ని నిర్మించిందని దేవాదాయ అధికారులు వెల్లడించారు.
ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడం ఈ దుర్ఘటనకు కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో, తొక్కిసలాట ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, భక్తుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.








