భార్యను నియంత్రించేందుకు పెళ్లి లైసెన్స్ కాదు

భార్యను నియంత్రించేందుకు పెళ్లి లైసెన్స్ కాదు: కర్ణాటక హైకోర్టు

Summarize with AI

వివాహం జరిగినంత మాత్రాన భార్య వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలు, వ్యక్తిత్వాన్ని నియంత్రించే అధికారం భర్తకు లభించదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలంటే భర్తతో పాటు అత్తమామల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. వివాహబంధం అనేది జీవిత భాగస్వామి స్వేచ్ఛను నియంత్రించేందుకు ఇచ్చిన లైసెన్స్ కాదని వ్యాఖ్యానించింది.

బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగల తాలూకాకు చెందిన సతీష్‌, జ్యోతి దంపతులకు ఐదేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ విభేదాల నేపథ్యంలో జ్యోతి తన కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లి, తనకు మరియు కుమార్తెకు నెలకు రూ.30 వేల భరణం కోరుతూ తుమకూరు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ అనంతరం భార్యకు రూ.5 వేలు, కుమార్తెకు రూ.4 వేల చొప్పున మొత్తం రూ.9 వేల భరణం చెల్లించాలని 2025 నవంబర్‌ 5న ఆదేశించింది.

ఈ మొత్తాన్ని తగ్గించాలని కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తాను కూలి పని చేస్తూ జీవిస్తున్నానని, వృద్ధ తల్లిదండ్రులను కూడా పోషించాల్సి ఉందని వాదించాడు. భార్య తనకు, తన తల్లిదండ్రులకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లేదని, ఇంటి పనులు సరిగా చేయడం లేదని ఆరోపించాడు. అయితే ఈ వాదనలపై కోర్టు స్పందిస్తూ.. భార్యను ఇంటి పనులు, అత్తమామల సేవలకు మాత్రమే పరిమితం చేసే వ్యక్తిగా చూడటం సరికాదని స్పష్టం చేసింది.

ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు భార్యకు మాత్రమే సంబంధించినవి కావని హైకోర్టు పేర్కొంది. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారి కుమారుడు లేదా కుమార్తెదేనని, కోడలు లేదా అల్లుడు స్వచ్ఛందంగా సేవ చేయవచ్చుగానీ దానిని బలవంతపు బాధ్యతగా మార్చలేమని తెలిపింది. భార్య వేరుగా నివసించడానికి తగిన కారణాలు ఉన్నాయని గుర్తించిన కోర్టు, ఆమెకు భరణం నిరాకరించేందుకు భర్త చేసిన వాదనలు సరిపోవని తేల్చింది.

భార్య, కుమార్తెకు కలిపి నెలకు రూ.9 వేల భరణం అధికం కాదని కూడా కోర్టు పేర్కొంది. ఇద్దరికీ కలిపి రోజుకు రూ.300, ఒక్కొక్కరికి రోజుకు రూ.150 మాత్రమే వస్తుందని, ప్రస్తుత జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుంటే ఇది కనీస జీవనానికి కూడా సరిపోదని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ డాక్టర్‌ చిల్లకూర్‌ సుమలత నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం 2026 ఆగస్టు 3న భర్త రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేసి, కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన భరణం ఆదేశాలను సమర్థించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment