మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో నిర్మించి, నటించిన కన్నప్ప (Kannappa) సినిమా పలు వివాదాలను ఎదుర్కొంటోంది. ఇటీవల సినిమా హార్డ్ డిస్క్ (Hard Disk) తస్కరించారని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఈ చిత్ర యూనిట్.. ప్రస్తుతం మరో వివాదంలో హైకోర్టు (High Court) ముందు హాజరుకానుంది. విషయం ఏంటంటే.. ఈ సినిమాలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని (Brahmin Social Group) కించపరిచే విధంగా సన్నివేశాలు, పాత్రధారుల పేర్లు ఉండటంపై ఏపీ హైకోర్టు (AP High Court)లో వ్యాజ్యం దాఖలైంది.
ఈ మేరకు బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ (Siripurapu Venkata Sridhar) పిటిషన్ దాఖలు చేయగా, న్యాయవాది వాదనలు వినిపించారు. సినిమా జూన్ 27న విడుదల కానున్నందున, విడుదలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టును కోరారు. కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ ప్రాంతీయ అధికారి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నటులు మంచు మోహన్‌బాబు, విష్ణు, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
న్యాయమూర్తి జస్టిస్ (Justice) ఎస్.సుబ్బారెడ్డి (S. Subbareddy) ఆగస్టు 1కి విచారణ వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమా విడుదల అనంతరం అభ్యంతరకర అంశాలుంటే తొలగించేందుకు ఆదేశాలు ఇవ్వగలమని ఆయన తెలిపారు.