కడప (Kadapa)లోని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ (Architecture University) వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యూనివర్సిటీ (University)ని అకస్మాత్తుగా తరలించాలనే కూటమి ప్రభుత్వ (Coalition Government’s) నిర్ణయం విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యోగివేమన యూనివర్సిటీలోని గురుకుల బిల్డింగ్స్‌లోకి తరలించేందుకు సన్నాహాలు చేయగా, అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవని, వర్సిటీ నిర్వహణకు అది సరిపోదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల ప్రమేయంతో అకస్మాత్తు తరలింపు ప్రక్రియ చేపట్టగా, వారిని అడ్డుకునేందుకు భవన యాజమాన్యం సిద్ధమవ్వగా, అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
భవన యాజమాన్యానికి సుమారు రూ.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నా, ప్రభుత్వం ముందస్తు నోటీసు ఇవ్వకుండా తరలింపు ప్రక్రియ ప్రారంభించిందని విద్యార్థులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలల ముందే ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అకస్మాత్తు నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వీసీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా, భవన యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు (High Court) తక్షణమే జోక్యం చేసుకొని యూనివర్సిటీ తరలింపుపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో యూనివర్సిటీ యంత్రాంగం వెనక్కు తగ్గింది. స్థానికులు, వైసీపీ(YSRCP) నాయకులు మాట్లాడుతూ.. “కేవలం వైఎస్ జగన్(YS Jagan) స్థాపించిన యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది” అని ఆరోపించారు. గతంలోనూ అడ్మిషన్లు నిలిపివేసి కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు తరలింపు పేరుతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తెస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.





 



