మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు మళ్లీ వరద (Flood) ముప్పు (Threat) ఎదురైంది. రెండు రోజులుగా వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో స్వల్ప విరామం వచ్చినప్పటికీ, శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జూరాల డ్యామ్‌లోని 23 గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి ప్రతి సెకనుకు 1,15,000 క్యూసెక్కుల (Cusecs) నీరు ప్రవేశిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదే సమయంలో 1,24,562 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.520 మీటర్ల వద్ద నమోదు అయింది. ఉధృతంగా వస్తున్న వరదనీరు ప్రస్తుతం శ్రీశైలానికి చేరుతోంది.
ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రవాహాన్ని సమయానికి అంచనా వేసుకుంటూ, డ్యామ్ దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.







