మెడికల్ కాలేజీ (Medical College)లో చోటుచేసుకున్న విద్యార్థిని ఆత్మహత్య ఘటన తెలంగాణ (Telangana)లో తీవ్ర కలకలం రేపింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య (Lavanya) (2020 బ్యాచ్) సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మెడిసిన్ విద్యార్థినిగా చదివి, ప్రస్తుతం అదే కాలేజీలో హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఆత్మహత్యకు యత్నించింది. సీరియస్ కండీషన్‌లో ఉన్న లావణ్యను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మొదట్లో స్పష్టంగా తెలియకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాలేజీ వర్గాలు, విద్యార్థుల్లో తీవ్ర విషాదం నెలకొనగా… జూనియర్ డాక్టర్ (Junior Doctor) మృతి వెనుక అసలు కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే (Love Affair) కారణమని పోలీసులు తేల్చారు. లావణ్య, డాక్టర్ ప్రణయ్ తేజ్ (Dr. Pranay Tej) గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారని విచారణలో వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరంటూ ప్రణయ్ వెనక్కి తగ్గినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా లావణ్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వెల్లడైంది.
ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ ప్రణయ్ తేజ్‌ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని మానసికంగా వేధించిన అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. లావణ్య మృతి వైద్య విద్యార్థుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.








