జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు భావించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వార్తా కథనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదట మహమ్మద్ అజారుద్దీన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావించినా, అనూహ్యంగా ఆయనను ఎమ్మెల్సీగా నియమించింది. దీంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. ఈలోపు, బీఆర్‌ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించి, నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు తమ బలం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే, ఈ తరుణంలో బీఆర్‌ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది.

పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం కవిత నివాసంలో ఆమెతో అరగంటకు పైగా భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ, పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రి వేడుకలకు కవితను ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే, ఈ భేటీలో జూబ్లీహిల్స్ టికెట్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. గతంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, ఇప్పుడు టికెట్ దక్కదని భావించి కవితను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల బీఆర్‌ఎస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, ఆమె పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. భవిష్యత్తులో రాజకీయంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేసీఆర్ ఫోటోతోనే ముందుకు సాగుతానని ఆమె ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment