జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు (By-Election) సంబంధించిన నామినేషన్ల (Nominations) పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 211 మంది అభ్యర్థుల కోసం దాఖలైన 321 సెట్ల నామినేషన్లలో, అధికారులు 135 సెట్లను ఆమోదించారు. మిగిలిన 186 సెట్ల నామినేషన్లు (130 మంది అభ్యర్థులవి) వివిధ లోపాల కారణంగా తిరస్కరించబడ్డాయి. బీఆర్ఎస్(BRS) అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha), కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) నామినేషన్లలో మొదట కొన్ని లోపాలు గుర్తించినప్పటికీ, వారి వివరణ, అవసరమైన డిక్లరేషన్ సమర్పించిన తర్వాత అధికారులు వాటిని ఆమోదించారు.
నవంబర్ 11న జరగనున్న ఈ ఉప ఎన్నికలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బదులుగా, పోలింగ్ కోసం ఎం3 ను వినియోగించనున్నారు. ఎం3 మెషీన్లు మూడవ తరం యంత్రాలు కావడం విశేషం, వీటిలో వీవీపీటీ (VVPAT) వ్యవస్థ కూడా ఉంది. ఈ ఎం3 మెషీన్ల ద్వారా ఒక్క కంట్రోల్ యూనిట్‌కి గరిష్టంగా 24 బ్యాలెటింగ్ యూనిట్లు జత చేయవచ్చు.
ఎం3 మెషీన్ల వల్ల ఒక్క నియోజకవర్గంలో 384 మంది అభ్యర్థుల వరకు వివరాలను సులభంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. ప్రతి బ్యాలెటింగ్ యూనిట్‌లో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థుల వివరాలు ప్రదర్శించబడతాయి. కాగా, పాత తరం ఎం2 మెషీన్లు కేవలం 4 బ్యాలెట్ యూనిట్లను మాత్రమే కలుపగలవు. అందువల్ల, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, ఎం3 మెషీన్లు ఎన్నికల ప్రక్రియ నిర్వహణను మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.








