ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఛీఫ్ స్పందన
ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించిందని, ఆయన అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహించడంపై విమర్శలు చేసింది. అయితే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చి సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నడ్డా మాట్లాడుతూ.. “మన్మోహన్ సింగ్ మరణం విషాదంగా మారినప్పటికీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని” అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ సింగ్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించిందని, ఆ సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా అందించినట్లు చెప్పారు.
పీవీ నరసింహారావు స్మారకం నిర్మాణంపై కూడా జేపీ నడ్డా తన విమర్శలు సంధించారు. సోనియా గాంధీ, పీవీ నరసింహారావు స్మారకం నిర్మించేందుకు అంగీకరించలేదని, ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ కార్యాలయంలో ఉంచేందుకు కూడా అనుమతించలేదని నడ్డా చెప్పారు.
2015లో పీవీ నరసింహారావుకు ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేసి, భారత రత్న ప్రదానం చేశారు అని ఆయన గుర్తుచేశారు. అలాగే, ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు, కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు.