నకిలీ మద్యం (Fake Liquor) కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ(YSRCP) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) పెద్ద నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మ (Kanaka Durga Devi) ఆలయానికి(Temple) చేరుకుని సత్యప్రమాణం చేశారు. ఘాట్ రోడ్ ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించి “ఈ వ్యవహారంలో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని కనకదుర్గ దేవి సాక్షిగా ప్రమాణం చేశారు.
జోగి రమేష్ మాట్లాడుతూ.. “నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు, నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నా కుటుంబాన్ని అవమానపరిచారు. అందుకే నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నేను చేసిన తప్పేమీ లేదు. నన్ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్నారు” అని విమర్శించారు.
మరోమారు సవాల్ విసిరుతూ.. “నకిలీ మద్యం కేసులో నాకు సంబంధం ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు (Chandrababu), లోకేష్(Lokesh)లు సత్యప్రమాణానికి సిద్ధమా? లేక లై డిటెక్టర్ టెస్టుకైనా రావాలా.? కనకదుర్గమ్మ సాక్షిగా నేను నిజం చెబుతున్నా. వారు నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటా” అని జోగి రమేష్ హెచ్చరించారు.





 



